యూనియన్ (భారత్ స్పెక్ట్రమ్) సెప్టెంబర్ 05
బీడీ కార్మికుల చేయూత పెన్షన్‌కు విధించిన కటాఫ్ తేదీని తొలగించి, అర్హులైన ప్రతి కార్మికుడికి పెన్షన్ అందించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
కటాఫ్ డేట్ తొలగించి అర్హులైన బీడీ కార్మికులందరికీ చేయూత పెన్షన్ ఇవ్వాలి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్ డిమాండ్ (భారత్ స్పెక్ట్రామ్ ):ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికుల చేయూత పెన్షన్‌కు విధించిన కటాఫ్ డేట్‌ను తొలగించి, అర్హులైన ప్రతి బీడీ కార్మికుడికి పెన్షన్ అందించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం అంగడి బజార్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 7.50 లక్షల మంది బీడీ కార్మికులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 1.50 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారని తెలిపారు. చాలీచాలని కూలితో బీడీలు చుడుతూ కార్మికులు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం తర్వాత రాష్ట్రంలో బీడీ పరిశ్రమ అతిపెద్ద ఉపాధి రంగంగా ఉందని, అయితే బీడీ కార్మికుల సంక్షేమాన్ని పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ కార్మికుల హక్కులను హరిస్తోందని ఆరోపించారు. గతంలో బీడీ కార్మికులందరికీ పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, 28-02-2014 కటాఫ్ డేట్ విధించడం వల్ల వేలాది మంది అర్హులైన బీడీ కార్మికులు పెన్షన్‌కు దూరమయ్యారని రమేష్ తెలిపారు. గత ఎన్నికల సమయంలో ప్రస్తుత ప్రభుత్వం కటాఫ్ డేట్‌ను తొలగించి అర్హులైన ప్రతి బీడీ కార్మికుడికి చేయూత పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. పాత లబ్ధిదారులకు రూ.4,016 పెన్షన్ అందిస్తామని కూడా హామీ ఇచ్చి, ప్రస్తుతం ఆ హామీలను అమలు చేయకపోవడం విచారకరమన్నారు. ప్రస్తుతం ఇతర వర్గాలకు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ, బీడీ కార్మికులకు మాత్రం అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. బీడీ కార్మికుల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, కటాఫ్ డేట్ తొలగించి అర్హులైన ప్రతి కార్మికుడికి చేయూత పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీడీ కార్మికులు ఈ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులను పెద్ద ఎత్తున సమీకరించి ర్యాలీలు, ధర్నాలు, ఇతర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కె. రాజేశ్వర్ అధ్యక్షత వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు వి. సత్తెమ్మ, రాష్ట్ర నాయకురాలు పి. రమ ప్రసంగించారు. జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. కిశోర్, ఏఐయుకెఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆర్. దామోదర్, ఏపీకేఎంఎస్ జిల్లా నాయకులు బి. కిషోర్, పీవోడబ్ల్యూ డివిజన్ కార్యదర్శి ఆర్. పుష్పలత, డివిజన్ నాయకులు బి. లావణ్య, ఇ. జమున, జి. ప్రవీణ్, ఏఐయుకెఎస్ నాయకులు జి. బబ్లు, ఎల్. గోపి, జీపీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఓ. ఆశన్న, నాయకులు ఎస్. విలాస్ తదితరులు పాల్గొన్నారు.












