భీంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా భేటీ జన్మోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు శిశు సంరక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఆడపిల్లల జననాన్ని ఆనందోత్సవంగా జరుపుకోవాలని సీడీపీఓ జ్ఞానేశ్వరి సూచించారు.
మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ద్వారా, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా సోమవారం భీంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో భేటీ జన్మోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు శిశువుల సంరక్షణకు అవసరమైన బేటీ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భీంగల్ మెడికల్ ఆఫీసర్, మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ జ్ఞానేశ్వరి, ఏసీడీపీఓ జ్యోతి, సూపర్వైజర్లు విజయరాణి, శారద, హెల్త్ సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది, మహిళా సాధికారత విభాగం జెండర్ స్పెషలిస్ట్ కవిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీడీపీఓ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆడపిల్ల పుట్టిన సందర్భాన్ని ఆనందోత్సవంగా జరుపుకోవాలని సూచించారు. బాలబాలికల పట్ల ఎలాంటి వివక్ష చూపకుండా సమానత్వ భావాలను పెంపొందించుకోవాలని, ఆడపిల్లల సంరక్షణ, విద్య, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆడపిల్లల పట్ల సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం, వారి హక్కులను పరిరక్షించడం, బాలికల ప్రాధాన్యతను తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.












