దేశ అంతర్గత భద్రత, ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆదివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్, బైక్ ర్యాలీ నిర్వహించారు.
పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ర్యాలీని ఉదయం పూలాంగ్ చౌరస్తా వద్ద అదనపు పోలీస్ కమిషనర్ శుభం ప్రకాష్ జెండా ఊపి ప్రారంభించారు. పూలాంగ్ చౌరస్తా నుంచి ప్రగతి హాస్పిటల్, ఎల్ఐసీ చౌరస్తా, కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు ర్యాలీ కొనసాగింది. పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అమరవీరుల సేవలు చిరస్థాయి
ఈ సందర్భంగా శుభం ప్రకాష్ మాట్లాడుతూ.. నక్సలైట్లు, మతతత్వ విభజన శక్తులు, ఇతర సవాళ్లను ఎదుర్కొంటూ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత కోసం ఎంతోమంది పోలీసులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. వారి త్యాగాల ఫలితంగానే ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన అన్నారు.
ప్రజలకు సూచనలు
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు. అమరవీరుల కుటుంబాలను పరామర్శిస్తూ పోలీస్ శాఖ వారికి అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు. పోలీసులంతా ఒకే కుటుంబమని, వారు ధరించే యూనిఫాం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని ఆయన అన్నారు. న్యాయం, నిష్పక్షపాతం, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ పార్టీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.











