నిజామాబాద్, ఆదివారం
నిజామాబాద్ నగరంలో ఆదివారం జరగనున్న ఊర పండుగ సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య స్వయంగా పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాంతిభద్రతలను కాపాడేందుకు, ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు.
నిజామాబాద్ నగరంలో ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్న ఊర పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ట్రాఫిక్ రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పండుగ జరుగుతున్న ప్రధాన ప్రాంతాలు, ఊరేగింపు మార్గాలు, రద్దీ కూడళ్లు, ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలను సందర్శించి పోలీసు అధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రతి సున్నిత ప్రాంతంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
పండుగకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశమున్నందున మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా పోలీసు బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, అంబులెన్స్‌లు, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పండుగ ప్రాంతమంతా సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. పికెట్లు, మొబైల్ పెట్రోలింగ్ బృందాలు, షీ టీమ్స్, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేసి భక్తులకు భద్రత కల్పించాలని సూచించారు.
అలాగే ఊరేగింపు సమయంలో ప్రజలు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్ మళ్లింపులకు సహకరించాలని, పిల్లలను ఒంటరిగా వదిలివేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ శాఖ అన్ని విధాలుగా విస్తృత బందోబస్తు చర్యలు చేపట్టిందని, ప్రజల సహకారంతో పండుగ విజయవంతంగా నిర్వహించగలమనే విశ్వాసాన్ని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాదు, సి.సి.ఆర్.బి, సి.సి.ఎస్ ఎ.సి.పి లు ప్రకాష్ యాదవ్, గురు నాయుడు, శ్రీశైలం, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, టౌన్ సిఐ శ్రీనివాసరాజ్, సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్, ఎస్.హెచ్.ఓ రఘుపతి మరియు ఎస్.ఐ లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










