మెండోర పోలీస్ స్టేషన్ ను సందర్శించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా ప్రతీ సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని, ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.
శుక్రవారం ఉదయం మెండోర పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సందర్భంగా, ఆయన వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ విభాగం నిర్విరామంగా నిర్వహిస్తున్న పనితీరును పరిశీలించి, ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
మెండోర పీఎస్ పరిధిలోని రికార్డులను పరిశీలించి, అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల చేదనకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన విచారణ జరపాలని సబ్ ఇన్స్పెక్టర్ కు సూచనలు చేశారు.
ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని, పాఠశాలలు, కళాశాలలు, సోషల్ మీడియా ద్వారా సైబర్ క్రైమ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే, పరిధిలోని గ్రామాల్లో విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించి, సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయాలని కోరారు.
పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లో నిర్మల్, మెట్ పల్లి ఉన్నందున, వాహనాల రాకపోకలపై నిరంతరం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
ఆన్లైన్ బెట్టింగ్స్, గేమ్స్ ఆడుతూ సైబర్ మోసగాళ్ల చేతిలో డబ్బులు కోల్పోయి, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు.
అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, అధికారులు, సిబ్బంది 24x7 హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని, దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలని, బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఆదర్శంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీ జి. జాన్ రెడ్డి, మెండోర ఎస్సై జె. సుహాసిని, సిబ్బంది పాల్గొన్నారు.










