నిజామాబాద్ నార్త్ తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సర్వే నంబర్ మార్పుపై సమగ్ర విచారణ జరుగుతుందా? అసలు సూత్రధారులపై చర్యలు తీసుకుంటారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లను తట్టుకొని నిజాలను నిగ్గు తేలుస్తారా లేక తూతూ మంత్రంగా విచారణ జరిపి ఫైల్‌ను బుట్టదాఖలు చేస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి.
అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త సమీప బంధువుకు సంబంధించిన స్థలాన్ని ఇతరుల పేరు మీద మార్పు చేయడం కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపించిన కలెక్టర్, నార్త్ తహసీల్దార్ కార్యాలయం రికార్డ్ అసిస్టెంట్ రాహుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే, ఈ వ్యవహారంలో కార్యాలయంలోని మరో ఇద్దరి పాత్ర ఉన్నట్లు బహిరంగంగా చర్చ జరుగుతోంది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గినట్లు రెవెన్యూ శాఖలో జోరుగా ప్రచారం సాగుతోంది.
నిజామాబాద్ నగర శివారులో గల 291, 292 సర్వే నంబర్లకు సంబంధించి వెయ్యి గజాల స్థలాన్ని పహాణీ, సర్వే నంబర్లలో మార్పు చేయడం రెవెన్యూ శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ఇది చర్చనీయాంశంగా మారింది. తప్పు చేసిన వారిని శిక్షిస్తారా లేక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నా వారిని వదిలేస్తారా అనే ప్రచారం జరుగుతోంది.
ఇదే తరహాలో మరికొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికిగాను ఒక ప్లాటు లేదా లక్షల రూపాయలలో బహుమతిగా పొందినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో బయటి వ్యక్తి ఒకరు తెర వెనుక కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అతను ఎవరు అనేది గుర్తిస్తే పెద్ద తలకాయల గుట్టు రట్టవుతుంది. వీరిని కాపాడేందుకు రాజకీయ నాయకులు చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికే అధికార పార్టీకి చెందిన నేత ఒకరు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే, ఈ విషయంలో జిల్లా కలెక్టర్ సీరియస్‌గా ఉండటంతో అసలు సూత్రధారులపై చర్యలు తప్పవనే మరో వాదన వినిపిస్తోంది. లోతుగా విచారణ జరిపితే ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వెలుగులోకి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.









