నిజామాబాద్, 2023-06-29
ఉత్తర తెలంగాణలో గంజాయి సాగు తగ్గినప్పటికీ, వినియోగం మాత్రం విస్తరిస్తోంది. నిరుద్యోగ యువత, ఉద్యోగులు, విద్యార్థులు గంజాయి మత్తుకు అలవాటు పడుతున్నారు. సమీపంలోనే గంజాయి లభించడంతో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో రూ.2 కోట్ల విలువైన గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
ఉత్తర తెలంగాణలో ఒకప్పుడు గంజాయి సాగుకు అనువైన జిల్లాగా ఉన్న ఇందూర్ ఇప్పుడు గంజాయి ఎగుమతికి కేరాఫ్ గా మారిందా అంటే ఔననే చెప్పాలి. గంజాయి సాగుపై ఎక్సైజ్ పోలీసులు ఉక్కపాదం మోపడంతో అటవి శివారు ప్రాంతాల్లో, తాండలల్లో గంజాయి మొలకలు కూడా దొరకడం లేదు. కానీ గంజాయి వినియోగం గల్లీ నుంచి మొదలుకుని గ్రామాల వరకు విస్తరించడమే ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు కేవలం ఆవారా యువత మత్తు కోసమే గంజాయిని వినియోగించారనేది బహిరంగ రహస్యం. కానీ ఇప్పుడు నిరుద్యోగ యువతతో పాటు ఉద్యోగులు, కాలేజి విద్యార్థులతో పాటు గంజాయి మత్తుకు అలవాటు పడ్డారు. గంజాయి కిక్కు కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేకుండానే సమీపంలోని గంజాయి చిన్నపుడిగెలు మొదలుకుని కిలోల వరకు లభిస్తుండడంతో కిక్కు కోసం వ్యయప్రయాసాలు లేకుండానే ఖర్చు చేస్తే దొరికేంత చెంతలోనే గంజాయి విక్రయాలు అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా సాగుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయిని నిజామాబాద్ మీదుగా తరలిస్తుండగా కామారెడ్డి పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కోట్ల విలువైన గంజాయి రవాణా కామారెడ్డి మీదుగా జరుగుతుందన్న సమాచారంతో జిల్లాలోని పది మంది ఎస్సైలతో ఆపరేషన్ కవచ్ చేపట్టారు. చివరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్టు సమీపంలోని దాబా వద్ద అశోక లేలైండ్ వాహనాన్ని గుర్తించారు. పనసపండ్ల మాటున తరలిస్తున్న మూడు క్వింటాళ్ళ సుమారు రూ.2 కోట్ల విలువైన గంజాయి దొరకడం కలకలం రేపింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వంద గ్రాముల గంజాయి దొరికినా, సేవించినా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కేసులు పెట్టి జైలుకు పంపుతున్న విషయం తెలిసిందే. కానీ ఏకంగా రూ.2 కోట్ల విలువైన గంజాయిని తరలించడం మామూలు విషయం కాదు. పోలీసులు విచారణలో మహారాష్ట్రకు ఎగుమతి చేస్తున్నారని చెబుతున్నా స్థానికంగా విక్రయిస్తారా? లేదా? అని నిర్ధారించలేకపోతున్నారు.
గంజాయి కిక్కు కోసం ఇప్పుడు ఎవరు ఖర్చుకు వెనుకాడడం లేదు. గంజాయి సేవించడంతో పాటు గంజాయి ద్వారా తయారయ్యే హాష్ ఆయిల్ కు, గంజాయి చాక్లెట్లకు భలే డిమాండ్ ఉంది. దానిని సొమ్ము చేసుకునేందుకే గంజాయి స్మగ్లర్లు పెద్ద ఎత్తున గంజాయిని దిగుమతి చేసుకుని దందా చేస్తున్నారని చెప్పాలి. నిజామాబాద్ లో గంజాయి స్మగ్లర్లకు కొదవ లేదు. కానీ కోట్లలో గంజాయిని తెప్పిస్తున్నారంటే దాని వెనుక ఉన్న నెట్ వర్క్ మూలాలు ఇప్పటి వరకు టీజీ న్యాబ్, ఈగల్ టీంకు చిక్కలేదంటే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పేరు మోసిన గంజాయి స్మగ్లర్ల వెనుక కొందరు ఉండి గంజాయి దందా చేయిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. లక్షల్లో పెట్టుబడి పెట్టి కోట్లు కమాయిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. గంజాయి స్మగ్లర్లు రియల్ ఎస్టేట్ దందాలతో పాటు ఎడ్యుకేషన్ ఇన్స్ ట్యూషన్ లలో పార్ట్ నర్లుగా, ఫంక్షన్ హాళ్లు, వ్యవసాయ భూములతో పాటు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహణలోనూ దందాలు చేస్తున్న విషయం అంతా ఓపెనే. కానీ ఎక్కడా కూడా అధికారులెవ్వరూ ఈ విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక సెక్షన్ పరిధిలోని ఎక్సైజ్, పోలీసు శాఖలో ఒక బ్యాచ్ కు చెందిన అధికారులు గంజావాలాలతో అంటకాగిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కోట్లలో గంజాయి దందా జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే వాదనలున్నాయి. గంజాయి పై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ వారోత్సవాలను నిర్వహిస్తుంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మాత్రం గంజా స్మగ్లర్లను స్వేచ్ఛగా దందా చేస్తున్నారనే విమర్శలున్నాయి.











