నిజామాబాద్, జులై 3
నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అక్రమాస్తుల కేసులో కొత్త మలుపులు చోటుచేసుకున్నాయి. ఆయనకు చెందిన బ్యాంకు లాకర్లో కిలో బంగారం, కిలో వెండిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.43 కోట్లుగా అంచనా వేశారు.
నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. తాజాగా, ఆయనకు చెందిన బ్యాంకు లాకర్లో కిలో బంగారం బయటపడింది. నిజామాబాద్, హైదరాబాద్‌లలో మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో గతనెల 23వ తేదీన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడు ఆయన ఇంట్లో రూ.3 లక్షల నగదు, బ్యాంకు ఖాతాలో రూ.50 లక్షల నగదు గుర్తించి సీజ్ చేశారు.
అదేరోజు హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఉన్న ఇంటికి మల్లారెడ్డిని తీసుకెళ్లి అక్కడ కూడా విచారణ చేపట్టారు. తాజాగా, హైదరాబాద్‌లోని బ్యాంకుల్లో ఆయనకు మూడు లాకర్లు ఉన్నాయని గుర్తించి, వాటిని తెరిచి చూడగా రూ.1.43 కోట్ల విలువైన కిలో బంగారం, రూ.2.5 లక్షల విలువైన కిలో వెండి లభ్యమయ్యాయి. మల్లారెడ్డి నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఆరేళ్లపాటు పనిచేశారు.
ఈ సమయంలో ఆయన సాగించిన వసూళ్లపై డైరీ రాశారని, ఆ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కల్లు దుకాణాలు, వైన్ షాపుల నుంచి తీసుకుంటున్న పాత, కొత్త లంచాల వివరాలు అందులో కనిపించడం జనాల్లో, అధికారుల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.










