నిజామాబాద్, జులై 06
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారంలను గడువులోగా బూత్ లెవెల్ అధికారులకు (బీ.ఎల్.ఓ) అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే ఆగస్టు 5న ప్రచురించే ఓటర్ల ముసాయిదా జాబితాలో పేరు తొలగిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారంను పూరించి, నిర్ణీత గడువు లోపు ప్రతి ఓటరు తప్పనిసరిగా బూత్ లెవెల్ అధికారికి (బీ.ఎల్.ఓ) అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
సోమవారం ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు అందరూ విధిగా ఈ నెల 24వ తేదీ లోపు ఎన్యూమరేషన్ ఫారంను నింపి బీ. ఎల్. ఓలకు అందించాలన్నారు. లేని పక్షంలో ఆగస్టు 5న ప్రచురించే ఓటర్ల ముసాయిదా జాబితాలో పేరు కోల్పోతారని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోకూడదని, అధికారులు ఎంత పెద్ద హోదాలో, ఏ స్థాయిలో ఉన్నా ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు ఎన్యూమరేషన్ ఫారం అందించాల్సిందేనని అన్నారు. జిల్లాలో దాదాపుగా అన్ని ప్రాంతాలలో ఇప్పటికే ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. అయితే తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారంలను తగిన వివరాలతో పూరించి, బీ.ఎల్.ఓలకు గడువు లోపు అందించడం ఎంతో ముఖ్యమని సూచించారు.
ఈ మేరకు ఓటర్లకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, వివిధ శాఖల జిల్లా అధికారులకు, మండల స్పెషల్ ఆఫీసర్లు అవకాశం మేరకు తహసిల్దార్ కార్యాలయాలను సందర్శించి, ఎస్.ఐ.ఆర్ అమలు తీరును, బీ. ఎల్. ఓల పనితీరును పరిశీలించాలని అన్నారు.
ఎన్యూమరేషన్ ఫారం భర్తీ విషయంలో, ఎస్.ఐ.ఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ, తగిన సహకారం అందించేందుకు వీలుగా కలెక్టరేట్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ ను ఆదేశించారు.
సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ను క్రమం తప్పకుండా సందర్శించాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థలను మొక్కుబడిగా సందర్శించకుండా, వాటి పనితీరును నిశితంగా పరిశీలించాలని, ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నది గమనించాలని అన్నారు. అధికారుల సందర్శనతో విద్యా సంస్థల పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు.
ఓపెన్ బావులు వంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొని ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలని, విద్యార్థులు పాముకాటు, విష కీటకాల బారిన పడకుండా అన్ని విద్యా సంస్థల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంకిత భావంతో ఉత్తమ స్థాయిలో విధులు నిర్వర్తించే మండల స్పెషల్ ఆఫీసర్ ను ఎంపిక చేసి తగిన ప్రోత్సాహకం అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.
సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీ.ఆర్.ఓ గీత, జెడ్పీ సీ.ఈ.ఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, డీ.పీ.ఓ శ్రీనివాస్ రావు, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.









