పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను ఓర్పుతో విని చట్టపరమైన పరిష్కారం చూపాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పోలీస్ సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని మెండోరా పోలీస్ స్టేషన్‌ను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సిబ్బందికి సంబంధించిన కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలను సందర్శించి కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, ఫిర్యాదుల పరిష్కారం, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళలు, బాలికలకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. మహిళలు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ సమస్యలను పోలీసులకు తెలియజేసేలా స్టేషన్లలో అనుకూల వాతావరణం కల్పించాలని సూచించారు. మహిళలకు సంబంధించిన కేసులను సున్నితమైన అంశాలుగా పరిగణించి, అవసరమైన ఆధారాలను సేకరించి నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు. దర్యాప్తులో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చూడాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ఠను పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది నిత్యం తమ ప్రధాన కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది ముందస్తుగా సన్నద్ధం కావాలని, దూర ప్రాంతాల ప్రయాణాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ తనిఖీల్లో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, ఆర్మూర్ రూరల్ ఇన్స్పెక్టర్ జన్ రెడ్డి, మెండోరా ఎస్సై జె. సుహాసిని, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.












