కామారెడ్డి జిల్లాలో అప్పుడే పుట్టిన పసికందును ముళ్లపొదల్లో వదిలివేసిన ఘటన కలకలం రేపింది. శిశువు ఏడుపు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, వారు వెంటనే స్పందించి శిశువును రక్షించారు.
నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డకు తల్లి ఒడిలో చోటు దక్కాల్సింది పోయి ముళ్లపొదల్లో అనాథగా వదిలేసిన హృదయవిదారక ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో వదిలివెళ్లిన అమానవీయ చర్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మండలం ఎల్పుగొండ గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు నవజాత శిశువును ముళ్లపొదల్లో వదిలివెళ్లారు. శిశువు ఏడుపు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన దోమకొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పసికందును రక్షించారు.
రక్షించిన పసికందును తొలుత దోమకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో శిశువుకు చికిత్స అందిస్తున్నారు. తరువాత, శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కన్నబిడ్డకు తల్లి ప్రేమ, ఆప్యాయతలు అందాల్సిన సమయంలో ఇలా ముళ్లపొదల్లో వదిలివెళ్లడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. శిశువును ఎవరు, ఏ కారణంతో వదిలివెళ్లారనే విషయంపై దోమకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












