హైదరాబాద్, 23 July
అక్క, అన్నలను చంపిన బావపై ప్రతీకారం తీర్చుకునేందుకు బావమరిది దారుణానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ శివారు మీర్పేట్ లో రౌడీషీటర్ దాసరి సురేందర్ అలియాస్ సూరిని కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్య అనంతరం ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టి, సంఘటనా స్థలాన్ని చూపించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అక్క, అన్నను హతమార్చాడనే ప్రతీకారంతో బావమరిది.. బావను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం సంఘటనా స్థలం నుంచి ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టి, హత్య పరిసరాలను చూపించాడు. ఈ దారుణం హైదరాబాద్ శివారు మీర్పేట్ లో చోటుచేసుకుంది.
మీర్పేట్ ఇన్స్పెక్టర్ శోభన్ తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లికి చెందిన దాసరి సురేందర్ అలియాస్ సూరి(41) ఒక రౌడీషీటర్. ఇతడిపై 3 హత్య కేసులు, పోక్సో, దొంగతనాలు తదితర నేరాలపై మొత్తం 45 కేసులు నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్లో అప్పటి రాచకొండ సీపీ సుధీర్ బాబు.. సురేందర్ ను నగరం నుంచి బహిష్కరించారు. దీంతో అతడు వరంగల్ కు మకాం మార్చాడు. గతేడాది నవంబరులో అక్కడ ఓ హత్యకు పథకం వేసినట్టు గుర్తించిన పోలీసులు అతడిని ముందుగానే అరెస్ట్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక తిరిగి ఉప్పల్ కు చేరాడు. రెండో భార్య పూజతో కలిసి అక్కడే ఉంటున్నాడు.
వివరాల్లోకి వెళితే.. సురేందర్ తొలుత సబా ఫాతిమా అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆమె తప్పు చేసిందనే అనుమానంతో 2022లో ఆమెను హత్య చేశాడు. దీంతో సురేందర్ ను సబా ఫాతిమా పెద్ద తమ్ముడు సల్మాన్ (బావమరిది) బెదిరించాడు. అతడి వల్ల ఎప్పటికైనా ప్రమాదం ఉందని భావించిన సురేందర్, 2024లో సల్మాన్ ను చంపేసి జైలుకు వెళ్ళాడు. ప్రస్తుతం ఉప్పల్లో ఉంటున్నాడు.
ఫాతిమా చిన్నతమ్ముడు అర్ఫాజ్ (24) నందనవనంలో ఉంటున్నాడు. అక్క, అన్నను హతమార్చిన సురేందర్ ను చంపేందుకు అర్ఫాజ్ అదను కోసం ఎదురుచూశాడు. తనపై అనుమానం రాకుండా సురేందర్ తో స్నేహంగా ఉంటున్నట్టు నటించాడు. నందనవనం గణేశ్ నగర్ లో సురేందర్ రెండో భార్య పూజ అన్న గోవిందు ఉంటున్నాడు. సోమవారం రాత్రి 11.50 గంటలకు గోవిందు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మరో ముగ్గురితో కలిసి అక్కడికి వచ్చిన అర్ఫాజ్, గోవిందుకు కేక్ తినిపించాడు. ఏమరపాటుగా ఉన్న సురేందర్ ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లాడు. అతడు తేరుకునేలోపే కత్తితో పొడిచాడు. పారిపోయేందుకు యత్నించినా అరకిలోమీటర్ పాటు వెంటపడి మరోసారి కత్తితో పొడిచి హతమార్చాడు.
హత్యానంతరం.. అర్ఫాజ్ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో మిత్రులతో 'కైసా హై భాయ్.. ఎట్లుంది నా ఆట' అంటూ నవ్వుతూ సురేందర్ ను హత్య చేసిన విషయాన్ని పంచుకున్నాడు. సుమారు 4 నిమిషాల నిడివి గల ఈ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వేరే రాష్ట్రానికి పారిపోయేందుకు యత్నించిన అర్ఫాజ్ తో పాటు మరో ముగ్గురిని మంగళవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అర్ఫాజ్ తో వెళ్లిన ఇద్దరు యువకులకు హత్య పథకం గురించి తెలియదని పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలిసింది.








