నిజామాబాద్, 16 July
నిజామాబాద్ నగరంలో నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు, సీపీ ఆదేశాల మేరకు ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టారు.
నిజామాబాద్ నగరంలో అక్రమార్కులకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. తాజాగా కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి ఓ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించి పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని త్రి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఓ మహిళ భర్త గతంలో మరణించాడు. అతని పేరిట చంద్రశేఖర్ కాలనీ సమీపంలో 50 గజాల ఖాళీ స్థలం ఉంది.
స్థలం ఖాళీగా ఉండడంతో ఇర్ఫాన్, సలీం, శివ అనే ముగ్గురు వ్యక్తులు దానిపై కన్నేశారు. స్థలాన్ని కాజేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించాలని నిర్ణయించుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ శ్రీనివాస్ అనే వ్యక్తి సహాయంతో మహిళ భర్త పేరిట ఉన్న స్థలంపై ఇతరుల పేరిట నకిలీ డాక్యుమెంట్లను తయారు చేయించారు. అనంతరం వాటిని మార్పిడి చేసేందుకు ప్రయత్నించారు.
అయితే, ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు వెంటనే మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీపీ ఆదేశాల మేరకు, ఏసీపీ చొరవతో టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, మూడో టౌన్ ఎస్సై హరిబాబు విచారణ చేపట్టారు. నకిలీ పత్రాలు సృష్టించిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.








