ఆలూరు, 5 November
ఆర్టీఏ ఈ-చలాన్ పెండింగ్ లో ఉందని పంపిన నకిలీ సందేశాన్ని నమ్మి ఒక రైతు ఏకంగా 5.10 లక్షలు పోగొట్టుకున్నాడు. కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించి బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్న సొమ్ము క్షణాల్లో మాయమవడంతో బాధితుడైన రైతు లబోదిబోమంటున్నాడు.
ఆర్టీఏ ఈ-చలాన్ పెండింగ్ లో ఉందని పంపిన నకిలీ సందేశాన్ని నమ్మి ఒక రైతు ఏకంగా 5.10 లక్షలు పోగొట్టుకున్నాడు. కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించి బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్న సొమ్ము క్షణాల్లో మాయమవడంతో బాధితుడైన రైతు లబోదిబోమంటున్నాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల కేంద్రానికి చెందిన బంజ అంబేద్కర్ నాలుగు రోజుల క్రితం తన ధాన్యాన్ని విక్రయించగా వచ్చిన రూ.5.10 లక్షలను బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్నాడు. ఈ క్రమంలో అతని సెల్ఫోన్ కు ఆర్టీఏ ఈ-చలాన్ పెండింగ్ లో ఉందని గుర్తుతెలియని నంబర్ నుంచి ఒక సందేశం వచ్చింది. అందులో ఉన్న లింక్ ను ప్రభుత్వానికి సంబంధించినదిగా భావించి తెరవడంతో సైబర్ మోసగాళ్లు తమ పని కానిచ్చారు.
లింక్ ను క్లిక్ చేసిన కొద్ది సెకన్లలోనే వరుసగా నాలుగు ఆన్లైన్ లావాదేవీలు జరిగి బ్యాంకు ఖాతాలోని రూ.5.10 లక్షలు మాయమయ్యాయి. రెప్పపాటులో ఖాతా ఖాళీ కావడంతో రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అపరిచిత లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్టీఏ, ట్రాఫిక్ చలాన్ల పేరుతో గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను నమ్మవద్దని, ఎలాంటి అనుమానాస్పద లింకులను తెరవద్దని ఆర్మూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని, .. వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీలను ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు.












