నిజామాబాద్, 2026-09-16
అర్ధరాత్రి వేళల్లో అధిక శబ్దంతో బుల్లెట్ బైక్‌ను నడుపుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తిపై బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు అమర్చిన వాహనాలపై కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళ బుల్లెట్ ద్విచక్ర వాహనానికి శబ్ద కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్‌ను అమర్చుకొని, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమైన వ్యక్తిపై బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు.
అర్ధరాత్రి సమయంలో అధిక శబ్దంతో బుల్లెట్ బైక్‌ను నడుపుతూ వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే స్పందించి, సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పబ్లిక్ న్యూసెన్స్ మరియు శబ్ద కాలుష్యానికి కారణమైన బుల్లెట్ ద్విచక్ర వాహనాన్ని ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి సీజ్ చేశారు.
పోలీస్ కమిషనర్ హెచ్చరిక
ఈ సందర్భంగా గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్., మాట్లాడుతూ వాహనాలకు అధిక శబ్దాన్ని ఉత్పత్తి చేసే లేదా నిబంధనలకు విరుద్ధంగా మార్చిన సైలెన్సర్లను అమర్చుకోవడానికి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో అధిక శబ్దంతో వాహనాలు నడుపుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించడం, భయాందోళనలకు గురిచేయడం, పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడటం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు అమర్చుకున్న వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించడం, ముఖ్యంగా రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతల్లో ఒకటని పోలీస్ కమిషనర్ తెలిపారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వాహనాలను నడపకుండా పోలీస్ శాఖకు సహకరించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.












