మద్యం మత్తులో డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధిస్తూ గొడవకు దిగిన కుమారుడిని తండ్రి హత్య చేసిన ఘటన బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు కేసును ఛేదించి, నిందితుడైన తండ్రి కరుల శివరాంను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఎరుపు రంగు తువ్వాలును స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్ జిల్లా మండలం కల్లూరు గ్రామానికి చెందిన కరుల గంగమణి, శివరాం దంపతులు తమ కుమారుడు సురేష్తో కలిసి బిచ్కుందలో నివాసం ఉంటున్నారు. సురేష్ మద్యానికి బానిసై, తరచూ మద్యం సేవించి డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధిస్తూ కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. ఈ క్రమంలో రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన సురేష్, డబ్బుల కోసం తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. డబ్బులు లేవని చెప్పడంతో తల్లిపై చేయి చేసుకుంటూ, గొంతు పిసికి వేధించసాగాడు. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి శివరాం, తువ్వాలును కుమారుడి మెడకు చుట్టి బిగించడంతో సురేష్ మృతి చెందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై మృతుడి సోదరి చాకలి విజయ ఫిర్యాదు మేరకు, బిచ్కుంద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో బిచ్కుంద సీఐ రవికుమార్, ఎస్సై రాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
స్థానిక సమాచారం, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, నిందితుడు కరుల శివరాంను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఎరుపు రంగు తువ్వాలును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు బిచ్కుంద సీఐ రవికుమార్ తెలిపారు. కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన సీఐ రవికుమార్, ఎస్సై రాజు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించినట్లు సీఐ తెలిపారు.












