కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలో అర్ధరాత్రి యువతి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఆర్తి కౌర్ (19) హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇటీవలే నిశ్చితార్థం జరుపుకున్న యువతి హత్యకు గురికావడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఆర్తి కౌర్ వారం రోజుల క్రితం లోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. శనివారం ఉదయం ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో స్థానిక సెల్ టవర్ సమీపంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆర్తి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు వీరయ్య చౌదరి, సంతోష్, ఎస్సై మహేందర్ పోలీసు బృందాలతో పాటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇటీవలే ఆర్తికి నిశ్చితార్థం జరగడంతో త్వరలో పెళ్లి చేయాలని భావిస్తున్న కుటుంబంలో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది. యువతి హత్యకు గల కారణాలు, అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించి పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.












