Mopal, 2026-07-28
ఆస్ట్రేలియాకు వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మించి, రెండు లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై మోపాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మోపాల్ మండలం ముధక్పల్లి గ్రామానికి చెందిన దండు మధు (29) అనే యువకుడు, ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన షైన్ అబ్రాడ్ కన్సల్టెన్సీ యజమాని షేక్ సయీద్ అలియాస్ షేక్ తాహా (27) తనను ఆస్ట్రేలియాకు వర్క్ వీసాపై పంపిస్తానని నమ్మబలికి, ప్రాసెసింగ్ ఫీజు కింద న రెండు లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఫిర్యాదు చేశాడు.
అయితే, నిందితుడు బాధితుడిని విదేశాలకు పంపించకుండా, తీసుకున్న డబ్బులను కూడా తిరిగి చెల్లించకుండా కాలయాపన చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ స్పందించకపోవడంతో, 28.07.2026న ఒప్పందం చేసుకున్నామని చెప్పినా డబ్బులు తిరిగి చెల్లించలేదని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ మేరకు బాధితుడు మోపాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, తనను మోసం చేసి, బెదిరింపులకు పాల్పడిన నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు.
విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పే కన్సల్టెన్సీలను సంప్రదించే ముందు వాటి గుర్తింపు, రిజిస్ట్రేషన్, విశ్వసనీయతను పూర్తిగా పరిశీలించాలని, సరైన ధృవీకరణ లేకుండా ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని, విదేశీ ఉద్యోగాల పేరుతో వచ్చే మోసపూరిత హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోపాల్ ఎస్ హెచ్ ఓ సుస్మిత తెలిపారు.












