ప్రజా సమస్యల పరిష్కారానికి, నగర అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రాధాన్యతనిస్తూ నగర మేయర్ కూరగాయల ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ నిజామాబాద్‌లోని 3, 7, 39 డివిజన్లలో గురువారం విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.
పర్యటనలో భాగంగా మేయర్, కమిషనర్ అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానికులు తమ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి కొరత, డ్రైనేజీ కాలువల నిర్వహణలో లోపాలు, దెబ్బతిన్న రహదారులు, పారిశుద్ధ్య సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల ఫిర్యాదులను ఓపికగా ఆలకించిన మేయర్ ఉమారాణి, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నగర పరిశుభ్రత విషయంలో రాజీపడబోమని స్పష్టం చేస్తూ, చెత్త సేకరణ, కాలువల శుభ్రత, దోమల నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
తాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయాలని, నీటి నిల్వలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులకు సూచనలు జారీ చేశారు. దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.











