నిజామాబాద్ నగర శివారులో మాక్లూర్ మండలం చిన్నాపూర్ వద్ద నిర్మించిన అరణ్య అర్బన్ పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి, పార్కులోని సదుపాయాలను పరిశీలించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గుర్రంగూడ నుండి వర్చువల్ గా అరణ్య అర్బన్ పార్క్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అర్పన, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు, అదనపు డీసీపీ, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. సఫారీ వాహనంలో పార్కును పర్యటించి, అందుబాటులో ఉన్న ఓపెన్ జిమ్ లు, వాకింగ్ ట్రాక్, ప్లే జోన్, కల్వర్టులు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, సోలార్ బోరుబావులు, రోడ్డు వసతులను పరిశీలించారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, అటవీ ప్రాంతాన్ని కాపాడడంలో ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కృషిని కొనియాడారు. పచ్చదనాన్ని పెంపొందించడం, వాతావరణ సమతుల్యాన్ని కాపాడటం, ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడం వంటి లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం అటవీ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మొక్కల పెంపకం ఆవశ్యకతను గుర్తెరిగి, వాటిని సంరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అడవులకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, 476 ఎకరాల విస్తీర్ణంలో నిజామాబాద్ నగరానికి సమీపంలో అరణ్య అర్బన్ పార్క్ అందుబాటులోకి రావడం సంతోషదాయకమని అన్నారు. ఇది ప్రజలకు ఆహ్లాదాన్ని, వ్యాయామం చేసుకునేందుకు వెసులుబాటును కల్పిస్తుందని తెలిపారు. అర్బన్ పార్క్ లో మరిన్ని వసతులు కల్పించాలని, అసాంఘిక శక్తుల ప్రవేశాన్ని నిరోధించాలని అధికారులను కోరారు. పచ్చదనం పెంపొందించే కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు.









