నిజామాబాద్, 2026-09-10
గ్రామ పంచాయతీలకు వచ్చే నిధుల వినియోగంలో జాప్యాన్ని తగ్గించి, గ్రామీణాభివృద్ధి పనులకు మరింత వేగం తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం2018 నాలుగో సవరణ బిల్లు2026కు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సవరణతో నిధులు నేరుగా గ్రామాలకు చేరి అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని ఆయన అన్నారు.
పంచాయతీల నిధులకు ఇక బ్రేకులు లేవు! నిధుల వినియోగ జాప్యానికి చెక్.. పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు భూపతి రెడ్డి మద్దతు గ్రామాభివృద్ధి పనులకు నిధులు సకాలంలో అందుబాటులోకి రావాలి: ఎమ్మెల్యే : గ్రామ పంచాయతీలకు వచ్చే నిధుల వినియోగంలో జాప్యానికి చెక్ పెట్టడంతో పాటు గ్రామీణాభివృద్ధి పనులకు మరింత వేగం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018 నాలుగో సవరణ బిల్లు–2026కు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. గురువారం శాసనసభలో బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాల కింద వచ్చే నిధులు ఇప్పటివరకు ట్రెజరీ ద్వారా జమ కావడం, వాటిని అభివృద్ధి పనులు, సిబ్బంది వేతనాలు, ఇతర అవసరాలకు వినియోగించుకునే క్రమంలో పరిపాలనా ప్రక్రియల కారణంగా జాప్యం జరిగేదని భూపతి రెడ్డి సభ దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని సందర్భాల్లో నిధుల ఉపసంహరణకు నెలల సమయం పట్టడంతో గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు కూడా ఆలస్యమయ్యేవని పేర్కొన్నారు. నిధులు.. నేరుగా గ్రామాల అభివృద్ధికే పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 70, సబ్సెక్షన్ (3)కు సవరణతో గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, వివిధ పథకాల ద్వారా వచ్చే నిధులను స్థానిక సహకార బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జమ చేసుకునే వెసులుబాటు కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులను సకాలంలో వినియోగించుకుని అభివృద్ధి పనులను వేగవంతం చేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, పంచాయతీ భవనాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి నిధుల సకాలంలో లభ్యత అత్యంత కీలకమని భూపతి రెడ్డి అన్నారు. నిధులు మంజూరైనా వాటి వినియోగంలో జాప్యం జరిగి గ్రామాల అభివృద్ధి కుంటుపడకూడదనే ఉద్దేశంతో ఈ సవరణ తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు మరింత వెసులుబాటు గ్రామ పంచాయతీలను స్వయం సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు స్థానిక సంస్థలకు పరిపాలనా సౌలభ్యం కల్పించడంలో ఈ సవరణ కీలక అడుగుగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. “గ్రామాల అభివృద్ధి కోసం మంజూరైన నిధులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆలస్యం కాకుండా.. ప్రజలకు అవసరమైన పనులకు సకాలంలో అందుబాటులోకి రావాలి. నిధుల వినియోగంలో జాప్యాన్ని తగ్గించి, పంచాయతీలకు మరింత వెసులుబాటు కల్పించే ఈ సవరణను స్వాగతిస్తున్నాను” అని భూపతి రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం, గ్రామీణాభివృద్ధికి వేగం పెంచడం ప్రజాపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఆయన తెలిపారు. పంచాయతీల ఆర్థిక నిర్వహణలో పారదర్శకతను కొనసాగిస్తూ, నిధులు సకాలంలో ప్రజా అవసరాలకు వినియోగించేలా చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు. గ్రామీణ తెలంగాణ అభివృద్ధికి దోహదపడే ఈ సవరణ బిల్లుకు శాసనసభలో తన సంపూర్ణ మద్దతు ఉంటుందని భూపతి రెడ్డి స్పష్టం చేశారు.










