సిరికొండ, 10 September
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై శాసనమండలి సభ్యుడు తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ లో దళిత జేఏసీ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఈ వ్యాఖ్యలు దళిత సమాజ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవని నాయకులు ఖండించారు.
స్పీకర్‌పై వ్యాఖ్యలు.. లో దళిత జేఏసీ భగ్గుమంది తాతా మధు వ్యాఖ్యలను ఖండిస్తూ భారీ నిరసన ప్రదర్శన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై శాసనమండలి సభ్యుడు తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మండల కేంద్రంలో దళిత జేఏసీ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దళిత జేఏసీ నాయకులు నక్క రాజేందర్, రావూట్ల రమేష్, నక్క రాజేశ్వర్, మొట్టల రాము, చిట్యాల రవిశంకర్ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న దళిత వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు. వ్యాఖ్యలు చేసిన బాధ్యులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా డప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడి పిలుపులో భాగంగా అక్కడికి వెళ్లిన దళితులు తిరిగి వెళ్లిన అనంతరం దళితులు రావడంతో ప్రాంతం మైలపడిందంటూ పసుపు నీళ్లు చల్లారని నాయకులు ఆరోపించారు. ఇది దళిత సమాజం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా వారు అభివర్ణించారు. ఈ ఘటనకు బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఇప్పటికీ వివక్షాపూరిత చర్యలకు పాల్పడటం సరికాదని, ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని దళిత జేఏసీ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో నల్ల బచ్చన్న, మొట్టల దీపక్, పిప్పర సంజీవ్‌తో పాటు వివిధ దళిత సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.










