నిజామాబాద్, 2026-08-08
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా కృషి చేయాలని శాసన సభ్యులు సూచించారు. నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన జరిగిన జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఎల్ నినో ప్రభావం, సాగునీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటలపై చర్చించారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా కృషి చేయాలని శాసన సభ్యులు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శనివారం నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డిలు ఈ సమావేశానికి హాజరుకాగా, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూరు, కౌలాస్ నాలా, పోచారం, రామడుగు తదితర జలాశయాలలో నీటి నిల్వల స్థితిగతులు, ఆయకట్టు పంటలకు సాగు నీటిని అందించే వెసులుబాటు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, పంటల వైవిద్యీకరణకై రైతులకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఎల్ నినో ప్రభావంపై ఆందోళన
ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, వివిధ జలాశయాల ద్వారా యాసంగి పంటలకు సాగు నీటిని అందించేందుకు వీలుగా ప్రతీ సంవత్సరం రబీ సీజన్ సమయంలో జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశాలు జరిగేవని గుర్తు చేశారు. అయితే ఈసారి ఎల్ నినో ప్రభావం వల్ల రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వ సూచనల మేరకు ఖరీఫ్ సీజన్ సమయంలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల మునుముందు వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నందున, వరి పంట విత్తుకున్న రైతులు నష్టపోకుండా అధికారులు చొరవ చూపాలని ఆయన కోరారు. ఇంకా పంట వేసుకోని రైతులు ఆరుతడి పంటలు, కూరగాయలు, ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతు వేదికల ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం నారు ముదిరిపోయినందున వరి నాట్లు వేసే సమయం మించిపోయిందని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడమే మేలు చేకూరుస్తుందని అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, నీటి పారుదల, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ, క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన తోడ్పాటును అందించాలని హితవు పలికారు.
నీటి వనరుల జాగ్రత్త వినియోగం
నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ, ఇటీవల తుపాను ప్రభావంతో కొంతవరకు వర్షాలు కురిసినప్పటికీ, ఎల్ నినో కారణంగా ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నందున అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే జిల్లాలో 3.96 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట వేసుకున్నారని, కమాండ్, నాన్ కమాండ్ ఏరియాలలో ఇంకనూ 45 వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు విత్తుకోవాల్సి ఉన్నందున వరికి బదులుగా జొన్న, మొక్కజొన్న, కూరగాయలు, పప్పుదినుసులు వంటి ఆరుతడి పంటలతో పాటు ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్ పామ్ సాగు ఎంతో శ్రేయస్కరం అయినందున వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. 80 టీ.ఎం.సీల పూర్తిస్థాయి సామర్ధ్యం కలిగిన శ్రీరాంసాగర్ రిజర్వాయర్ లో గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా ప్రస్తుత సమయానికి 40 టీ.ఎం.సీల నీరు నిలువ ఉందన్నారు. అయితే ఈ రిజర్వాయర్ ద్వారా ఆయకట్టు పంటలకు ఏ మేరకు సాగునీటిని విడుదల చేయాలన్నది ఈ నెలాఖరు (ఆగస్టు చివరి వారం)లో రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న శివం కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద నిజామాబాద్ జిల్లాలో లక్షా 15 వేల ఆయకట్టు విస్తీర్ణం ఉందని, ఈ జలాశయంలో ప్రస్తుతం 10.78 టీ.ఎం.సీల నీరు నిలువ ఉన్నందున ఆయకట్టుకు మూడు నుండి నాలుగు తడులు సాగు నీటిని అందించేందుకు అవకాశం ఉందన్నారు. రైతులు వేసుకున్న వరి పంటను పరిరక్షించేలా, ఇంకనూ పంటలు విత్తుకోని భూములలో ఆరుతడి పంటలు, కూరగాయలు, ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించేందుకు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.











