నిజామాబాద్, 10 September
అంకాపూర్‌లో అత్యాధునిక సదుపాయాలతో మోడల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును డిమాండ్ చేశారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఈ మార్కెట్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అంకాపూర్‌కు మోడల్ మార్కెట్ కావాల్సిందే! అసెంబ్లీలో గట్టిగా గళం వినిపించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి రైతుల కష్టాలు తీర్చేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలి పరిశీలించి ఏర్పాటు చేస్తాం.. మంత్రి తుమ్మల హామీ భారత్ స్పెక్ట్రమ్ ఉమ్మడి జిల్లా బ్యూరో అంకాపూర్ రైతుల చిరకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అసెంబ్లీ వేదికగా గళం వినిపించారు. అంకాపూర్‌లో అత్యాధునిక సదుపాయాలతో మోడల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని గురువారం క్వశ్చన్ అవర్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును డిమాండ్ చేశారు. అంకాపూర్‌లో కూరగాయల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుండటంతో నిత్యం వందలాది వాహనాల రాకపోకలు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచే రైతులు కూరగాయల విక్రయాల కోసం మార్కెట్ వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఉందన్నారు. రైతులకు కనీస మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సభ దృష్టికి తీసుకెళ్లారు. అంకాపూర్ నుంచి హైదరాబాద్, బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాలకు కొత్తిమీర వంటి వాణిజ్య పంటలు భారీగా తరలివెళ్తున్నాయని, ఏడాది పొడవునా మొక్కజొన్న విక్రయాలు జరుగుతున్నాయని వివరించారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న అంకాపూర్‌కు మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు, వినియోగదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. “దేశానికే ఆదర్శ గ్రామంగా పేరున్న అంకాపూర్‌ను మోడల్ కూరగాయల మార్కెట్‌కు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలి” అని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక గ్రాంట్ ద్వారా గ్రామానికి నిధులు వస్తున్న నేపథ్యంలో గ్రామ అభివృద్ధి కమిటీకి సబ్సిడీపై కోల్డ్ స్టోరేజీలు వంటి సౌకర్యాలు కల్పిస్తే స్థానిక రైతులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు కూడా మేలు జరుగుతుందని అన్నారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు విశ్రాంతి గదులు, తాగునీరు, పార్కింగ్ వంటి కనీస సౌకర్యాలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అంకాపూర్ వ్యవసాయ విధానాలను పరిశీలించేందుకు నిత్యం సందర్శకులు వస్తున్నారని, అలాంటి గ్రామానికి అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా మార్కెట్ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.












