గోనుగొప్పుల తండా (భారత్ స్పెక్ట్రమ్) సెప్టెంబర్ 02
గ్రామ పంచాయతీ పాలన నామమాత్రంగా మారిందని ఆరోపిస్తూ గోనుగొప్పుల తండా యువకులు వినూత్న నిరసనకు దిగారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో గ్రామంలో పూడుకుపోయిన మురికి కాలువలను వారే స్వయంగా శుభ్రం చేసి శ్రమదానం చేపట్టారు.
సర్పంచ్ నిర్లక్ష్యం: కాలువలను స్వయంగా శుభ్రం చేసుకున్న యువత గోనుగొప్పుల తండా: గ్రామ పంచాయతీ పాలన పూర్తిగా నామమాత్రంగా మారిందని ఆరోపిస్తూ గోనుగొప్పుల తండా యువకులు వినూత్న నిరసనకు దిగారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో గ్రామంలో పూడుకుపోయిన మురికి కాలువలను వారే స్వయంగా శుభ్రం చేసి శ్రమదానం చేపట్టారు. గత కొన్ని నెలలుగా గ్రామంలోని మురికి కాలువల్లో చెత్తాచెదారం, మట్టి పేరుకుపోయి మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. దీంతో తీవ్ర దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు విపరీతంగా పెరిగి రోగాలు ప్రబలే ప్రమాదం ఏర్పడింది. స్వల్ప వర్షం కురిసినా మురుగునీరు ఇళ్లలోకి చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై సర్పంచ్‌కు పలుమార్లు వినతులు అందించినా ఎలాంటి స్పందన లేదని స్థానిక యువకులు మండిపడ్డారు. గ్రామ పంచాయతీకి వస్తున్న పారిశుద్ధ్య నిధులు ఏమవుతున్నాయో అర్థం కావడం లేదని, కనీస పనులు కూడా చేపట్టకపోవడం ప్రజాప్రతినిధుల తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తండాలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించి, కాలువలకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని యువజన సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు.












