నిజామాబాద్, జూలై 07
ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల నుంచి రాగి కాయిల్స్ దొంగిలిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను, దొంగిలించిన సొమ్ము కొనుగోలు చేస్తున్న ఒకరిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 74 కిలోల రాగి తీగలు, దొంగతనానికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల నుంచి రాగి కాయిల్స్ దొంగిలిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను, దొంగిలించిన రాగి కాయిల్స్ కొనుగోలు చేస్తున్న ఒకరిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మంగళవారం వేల్పూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
ఆర్మూర్ పట్టణంలోని పోచమ్మ గల్లికి చెందిన కర్రె వినోద్ కుమార్, అండ్రాసి నవీన్, గుంజల్ల ఈశ్వర్, బాజా హరిప్రసాద్, కర్రె విజయకుమార్, మూల దుర్గ ప్రసాద్ రెడ్డిలు జల్సాలకు అలవాటుపడి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని కమిషనర్ తెలిపారు. వినోద్, విజయ్ అన్నదమ్ములు. వీరు పాత ఇనుప సామాను వ్యాపారులుగా మారువేషంలో ఆర్మూర్ డివిజన్ పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల్లో పట్టపగలు తిరుగుతూ, రాత్రివేళల్లో ఆరుగురితో కలిసి ట్రాన్స్ ఫార్మర్ల వద్దకు వెళ్లి రాగి తీగలను దొంగిలిస్తున్నారని, వాటిని అబ్దుల్ వసీంకు అమ్ముతున్నారని వెల్లడించారు.
పాత నేరస్తుడైన, సాప్ వ్యాపారి అబ్దుల్ వసీం హైమద్ అలియాస్ తిల్లిబాబా సలహా మేరకు ఈ ఆరుగురు ముఠాగా ఏర్పడి, ఆర్మూర్ డివిజన్ పరిధిలోని గ్రామాలతో పాటు చుట్టుపక్కల వ్యవసాయ ప్రాంతాల్లోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి తీగలను దొంగిలిస్తున్నారని, వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని తెలిపారు.
మంగళవారం కర్రె వినోద్ కుమార్, అండ్రాసి నవీన్, గుంజల్ల ఈశ్వర్, బాజా హరిప్రసాద్, కర్రె విజయకుమార్, మూల దుర్గ ప్రసాద్ రెడ్డిలను వేల్పూర్ మండలం పరిధిలోని పడిగెల గ్రామ శివారులో గల రైల్వే బ్రిడ్జి వద్ద పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని, వారి నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. దొంగ సొత్తు కొనుగోలు చేసిన నిందితుడు అబ్దుల్ వాసింను కూడా ఆర్మూర్ లో పట్టుకున్నట్లు తెలిపారు.
నిందితుల నుంచి 74 కిలోల రాగి తీగలు, దొంగతనం కోసం ఉపయోగించిన బజాజ్ మాక్సిమా ట్రాలీ ఆటో, హోండా షైన్ మోటార్ సైకిల్, యమహా స్కూటీ, బజాజ్ డిస్కవర్ మోటార్ సైకిల్, ఐదు మొబైల్ ఫోన్లు, దొంగతనం చేసేందుకు ఉపయోగించిన పనిముట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అబ్దుల్ వసీం అలియాస్ తిల్లి బాబాపై గతంలో ఆర్మూర్, మెండోర, నిజామాబాద్ నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్లలో చోరీ సొత్తు కొనుగోలు చేసిన కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
నిందితులు వేల్పూర్ పోలీస్ స్టేషన్ లో 4 కేసులు, బాల్కొండలో 5 కేసులు, మెండోరలో 3 కేసులు, భీంగల్ లో ఒక కేసు, ఆర్మూర్ లో 5 కేసులు, యెర్గట్ల పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, మొత్తం 19 కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, వేల్పూర్ మండల ఎస్సై సంజీవ్, బాల్కొండ ఎస్సై శైలేందర్, మెండోరా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ భరత్ గౌడ్, వేల్పూర్ మండల పోలీస్ కానిస్టేబుల్ నరేందర్, హెడ్ కానిస్టేబుల్ హరీష్, ముప్కాల్ మండల పోలీస్ కానిస్టేబుల్ సాయి కిరణ్, వేల్పూర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పీ. శ్రావణ్, వేల్పూర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సుదర్శన్ లను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.












