నాగర్కర్నూల్, శనివారం
నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండపేటలో వెలసిన పబ్బతి ఆంజనేయ స్వామి వారిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. అనంతరం రూ.10 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 20 ఏళ్ల క్రితం జెడ్పీటీసీగా ఎన్నికైన నాటి జ్ఞాపకాలతో గ్రామంలోకి అడుగుపెట్టిన సీఎంకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
నాగర్కర్నూల్ జిల్లా ఉరుకొండపేటలో కొలువైన పబ్బతి ఆంజనేయ స్వామి వారిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
తన రాజకీయ ప్రస్థానంలో 20 ఏళ్ల క్రితం జెడ్పీటీసీగా ఎన్నికైన నాటి మరువలేని అనుభూతులతో గ్రామంలో అడుగుపెట్టిన ముఖ్యమంత్రికి ఆత్మీయులు, ఆనాటి పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం, ఆనాటి సహచరులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో, అలనాటి తోటి సహచరులను ఆప్యాయంగా పలకరిస్తూ, ఒక్కొక్కరితో కరచాలనం చేస్తూ వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి తన గత అనుభవాలను నెమరువేసుకున్నారు. కొందరు 20 ఏళ్ల కిందట దిగిన ఫోటోలను చూపిస్తూ పాత అనుభవాలను గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఉరుకొండపేట గ్రామంలో కోలాహలం నెలకొంది.











