బ్లడ్ క్యాన్సర్‌కు చికిత్స లేదనే అపోహలను వీడాలని, ఆధునిక వైద్య విధానాలతో ఈ వ్యాధిని సమర్థవంతంగా నయం చేసే అవకాశాలున్నాయని బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ గజేశ్ జై షెత్వాల్ తెలిపారు. యశోద ఆస్పత్రిలో అత్యాధునిక బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాంతానికి చెందిన 50 మందికి పైగా బ్లడ్ క్యాన్సర్ బాధితులకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా చికిత్స అందించినట్లు ఆయన వెల్లడించారు. యశోద ఆస్పత్రిలో ఇప్పటివరకు వెయ్యికి పైగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. గత పదేళ్లలోనే 500కు పైగా చికిత్సలు చేపట్టినట్లు వివరించారు. ఆర్మూర్‌కు చెందిన ఆరేళ్ల బాలిక బ్లడ్ క్యాన్సర్‌తో తమ ఆస్పత్రికి వచ్చిందని, అంతకుముందు రెండేళ్లకే ఆమె తల్లి ఇదే వ్యాధితో మరణించిందని ఆయన గుర్తుచేశారు. ఆ బాలికకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా చికిత్స అందించగా, ప్రస్తుతం చికిత్స పూర్తయి ఐదేళ్లు గడిచాయని తెలిపారు. ఐదేళ్ల పాటు వ్యాధి తిరిగి రాకుండా ఉంటే, ఆ తర్వాత పునరావృతమయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. 2018లో బ్లడ్ క్యాన్సర్ బారినపడిన జపాన్‌కు చెందిన క్రీడాకారిణి రికక్ ఈపికి తమ ఆస్పత్రిలో చికిత్స అందించామని, అనంతరం 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ విభాగంలో ఆమె రజత పతకం సాధించిందని ఆయన గుర్తుచేశారు. వైద్యరంగంలో, ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో ఇటీవలి కాలంలో గణనీయమైన పురోగతి సాధించిందని, కొన్ని రకాల క్యాన్సర్లకు మాత్రల రూపంలోనూ చికిత్స అందుబాటులోకి వచ్చిందని ఆయన వివరించారు.
శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం కూడా క్యాన్సర్‌కు సంబంధించిన అంశాల్లో ఒకటని, ఇమ్యునోథెరపీ వంటి ఆధునిక విధానాలతో రోగనిరోధక వ్యవస్థను ఉపయోగించి క్యాన్సర్ కణాలపై పోరాడవచ్చని ఆయన తెలిపారు. గతంలో కార్టి-టి (-) చికిత్స కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చేదని, అక్కడ రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఖర్చయ్యేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ చికిత్సకు అవసరమైన ఉత్పత్తులు భారత్‌లోనే అందుబాటులోకి రావడంతో సుమారు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చుతో చికిత్స పొందే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్‌కు చెందిన ఓ యువతికి కూడా ఈ విధానంలో చికిత్స అందించినట్లు వెల్లడించారు. బ్లడ్ క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదని, వ్యాధిని ముందుగానే గుర్తించి సరైన వైద్య చికిత్స తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని డాక్టర్ గజేశ్ జై షెత్వాల్ సూచించారు. ఈ సమావేశంలో మధు, ధనుంజయ్ రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.


