భీంగల్ పట్టణ ప్రధాన రహదారి డివైడర్ సెంటర్ లైటింగ్ విషయంలో అధికారుల అలసత్వం వీడింది. రోజుల తరబడి నిరుపయోగంగా మారిన వీధి దీపాల వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు పురపాలక యంత్రాంగం స్పందించింది.
డివైడర్ మధ్యలో చెడిపోయిన పాత బల్బుల స్థానంలో నూతన విద్యుత్ బల్బులను క్రేన్ సహాయంతో అమర్చే పనులను మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి, కమిషనర్ డి. గజానంద్, ప్రజాప్రతినిధి జేజే నర్సయ్య తదితరులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే వాహనదారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వెలుతురు అందించేందుకే ఈ మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పట్టణ సుందరీకరణతో పాటు రహదారుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు.
నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై లైట్లు వెలగక ప్రమాదాలు పొంచి ఉన్నా, ఇన్నాళ్లూ ఉపేక్షించి, సమస్య తీవ్రమైన తర్వాతే చర్యలు చేపట్టడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నిర్వహణపై మున్సిపాలిటీ శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.












