కామారెడ్డి, 9 November
హార్వెస్టర్ మిషన్ అద్దెకు ఇస్తామని నమ్మించి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేసిన నలుగురు సభ్యుల ముఠాను దోమకొండ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో జైలులో పరిచయమైన నలుగురు కలిసి పక్కా పథకం ప్రకారం ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడిని కారులో అపహరించి, దాడి చేయడంతో పాటు నగదు, సెల్‌ఫోన్‌ను దోచుకున్నారు. మరోసారి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కోనాపూర్ గ్రామానికి చెందిన చెందం మురహర్ హార్స్ పవర్ మిషన్‌ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మిషన్ అద్దెకు ఇస్తామని నిందితులు అతడితో పరిచయం పెంచుకున్నారు. సుమారు నెల రోజుల పాటు ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడి నమ్మకం కలిగించారు. మిషన్ చూపిస్తామని కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. మార్గమధ్యంలో బాధితుడిపై దాడి చేసి సెల్‌ఫోన్‌తో పాటు రూ.2,500 నగదును బలవంతంగా లాక్కున్నారు. అయితే ఇందల్వాయి ప్రాంతంలో నిందితుల నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. బాధితుడిని మరోసారి కిడ్నాప్ చేసేందుకు అదే కారులో కోనాపూర్‌కు బయలుదేరిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కిడ్నాప్, దోపిడీకి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులపై గతంలో హత్య, దొంగతనం తదితర కేసులు నమోదైనట్లు తెలిపారు. వారి నుంచి కిడ్నాప్‌కు ఉపయోగించిన ఎర్టిగా కారు, నాలుగు సెల్ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన సీఐ నరేష్, దోమకొండ ఎస్ఐ ప్రభాకర్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


