నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, మహిళలు మరియు చిన్నారుల రక్షణ, సంక్షేమం, బాధితులకు సత్వర సహాయం అందించే లక్ష్యంతో భరోసా సెంటర్, న్యాయ శాఖ, చైల్డ్ వెల్ఫేర్, ఆరోగ్య శాఖల సమన్వయంతో కూడిన ఒక ముఖ్యమైన సమావేశం పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో నిర్వహించబడింది.
ఈ సమావేశంలో జిల్లాలో మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు, బాధితులకు న్యాయ సహాయం, వైద్య సేవలు, కౌన్సెలింగ్, పునరావాస చర్యలు, కేసుల విచారణలో అనుసరించాల్సిన విధివిధానాలు, శాఖల మధ్య సమాచార మార్పిడి వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. బాధితులకు ఒకే వేదికపై అన్ని సేవలు అందేలా భరోసా సెంటర్ ద్వారా చేపడుతున్న చర్యలను సమీక్షించారు.
నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీ ఎన్. శుభం ప్రకాష్ మాట్లాడుతూ, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, బాధితులు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా కోలుకునేందుకు అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు. ప్రతి కేసును సున్నితంగా పరిశీలిస్తూ, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్, న్యాయశాఖ, వైద్యశాఖ అధికారులు తమ తమ శాఖల పరిధిలో అందిస్తున్న సేవలు, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై వివరించారు. బాధితులకు నాణ్యమైన సేవలు అందించడంలో సమన్వయం కీలకమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమన్వయ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో ఏసీపీ శ్రీ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సిసిఆర్బి సిఐ శ్రీ పాండేరావు, ఎస్సై శ్రీ వర ప్రసాద్ రెడ్డి, ఫోక్సొ కోర్టు ఇన్చార్జ్ పి పి జి నరసింహారెడ్డి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ శోభారాణి, జిల్లా ప్రొఫెషనల్ ఆఫీసర్ శ్రీ పవన్ కళ్యాణ్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ జోత్స్న, డాక్టర్ వెంకటేష్, డి.సి.పి.ఓ శ్రీ చైతన్య, భరోసా సెంటర్ ఇన్చార్జి మహిళా ఎస్సై పుష్పావతి, భరోసా సెంటర్ రోజా మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











