జిల్లాలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నవాతే ప్రతాప్ మాట్లాడుతూ, అనుమతులు లేని పాఠశాలలు జిల్లాలో విచ్చలవిడిగా వెలుస్తున్నాయని, అయితే విద్యాశాఖ యంత్రాంగం వీటిపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని విమర్శించారు. క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు.
రేకుల షెడ్లలో, మౌలిక వసతులు లేని గదుల్లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, ఆట స్థలాలు లేకపోవడం, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించకపోవడం వంటి సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు.
విద్యార్థి సంఘాలు అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయని, గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోకపోతే ఎంఈఓ కార్యాలయాలను ముట్టడిస్తామని, అవసరమైతే డీఈఓ కార్యాలయం వద్ద ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఏఐఎస్బీ, పీడీఎస్, ఏఎఫ్డీఎస్, టీఎస్ఎఫ్ వంటి వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.








