మాక్లూర్ మండలంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తక్షణమే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కళాశాల ఆవరణను పరిశీలించిన కలెక్టర్, ప్రహరీ లేకపోవడాన్ని గమనించి, వెంటనే ఫెన్సింగ్ పనులు చేపట్టాలని సూచించారు. విద్యార్థినుల భద్రత దృష్ట్యా, కళాశాల పరిసరాల్లో పోలీసు పెట్రోలింగ్ పెంచాలని కోరారు. తుది దశలో ఉన్న నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
తరగతి గదులను సందర్శించిన కలెక్టర్, విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి అభ్యాసన స్థాయిని అంచనా వేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు బహుమతులు అందజేసి, నర్సింగ్ కోర్సు ప్రాముఖ్యతను వివరించారు. ఏకాగ్రతతో చదువుకోవాలని, ఉన్నత భవిష్యత్తుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.
కరోనా సమయంలో పారామెడికల్ సిబ్బంది సేవలను ప్రశంసించిన కలెక్టర్, నర్సింగ్ వృత్తిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా వంటి వాటికి దూరంగా ఉండాలని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని విద్యార్థినులకు హితవు పలికారు.
వ్యక్తిగత భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా ఇబ్బందులుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు. అవసరమైతే సఖీ వన్ స్టాప్ సెంటర్ ను సంప్రదిస్తే న్యాయం జరుగుతుందని, గోప్యత పాటిస్తారని భరోసా కల్పించారు. బయటి వ్యక్తులను కళాశాల లోపలికి అనుమతించరాదని నిర్వాహకులను ఆదేశించారు.











