పిల్లలు ఆన్లైన్ వేధింపులు, సైబర్ నేరాలకు గురికాకుండా వారికి అవసరమైన భద్రత, సంరక్షణ కోసం న్యాయ సేవల ప్రాధికార సంస్థ సూచనలకు, కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. డిజిటల్ వేదికలపై పిల్లల రక్షణ కోసం వ్యవస్థలను బలోపేతం చేయడానికి న్యాయసేవల సంస్థలు చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రతి గ్రామానికి చేరేలా ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ఆయన చెప్పారు.
జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో డిజిటల్ వేదికలపై పిల్లలకు రక్షణ, సులభంగా న్యాయం అందించడం: ఆన్లైన్ లైంగిక వేధింపులను అరికట్టడం, పిల్లలకు అనుకూలమైన న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం అనే ఇతివృత్తంపై దక్షిణాది ప్రాంతీయ సదస్సు హైదరాబాద్లో ప్రారంభమైంది.
ఈ సదస్సులో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ విక్రమ్ నాథ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ అలోక్ అరాధే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యాట్రన్-ఇన్-చీఫ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, త్రిపుర హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ శ్యామ్ కోషి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు హైకోర్టుల న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, పలువురు మాజీ న్యాయమూర్తులు పాల్గొన్నారు.
ఈ సదస్సులో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, మహిళలు, పిల్లల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. పోలీసులు, భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ప్రత్యేక కోర్టులు, న్యాయ సేవా సంస్థలు వంటి అనేక వ్యవస్థలు పనిచేస్తున్నాయని వివరించారు.











