నిజామాబాద్, 12 July
ప్రతి ఏటా జులై 12న 'ఇంటర్నేషనల్ పేపర్ బ్యాగ్ డే' సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం అంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రచారాలు, సదస్సులు నిర్వహిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఆశయాలు కాగితాలకే పరిమితమవుతున్నాయని స్పష్టమవుతోంది. నిజామాబాద్ జిల్లాలో ప్లాస్టిక్ వాడకం యథేచ్ఛగా కొనసాగుతోంది. పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఏటా జులై 12న 'ఇంటర్నేషనల్ పేపర్ బ్యాగ్ డే' (అంతర్జాతీయ కాగితపు సంచుల దినోత్సవం) సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం అంటూ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారాలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి, ప్రకృతికి హాని చేయని, రీసైక్లింగ్ చేయడానికి వీలుండే కాగితపు సంచుల ప్రాధాన్యతను చాటడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. కానీ, క్షేత్రస్థాయిలో అసలు వాస్తవ పరిస్థితిని గమనిస్తే ఈ ఆశయాలన్నీ కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని స్పష్టమవుతోంది. పర్యావరణాన్ని రక్షించాలనే నినాదాలు నిగూఢంగా మారిపోతుండగా, నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్లాస్టిక్ రక్కసి పంజా విసురుతూనే ఉంది. ప్రతి ఏటా ప్రత్యేక రోజులను జరుపుకోవడం తప్పితే, క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్ మహమ్మారిని అరికట్టేందుకు ఎలాంటి పటిష్టమైన చర్యలు కనిపించకపోవడం పర్యావరణ ప్రేమికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
నిజామాబాద్ జిల్లాలోని పట్టణ వీధులు, ప్రధాన కూడళ్లను పరిశీలిస్తే ఎటు చూసినా ప్లాస్టిక్ బ్యాగుల విచ్చలవిడి వాడకమే దర్శనమిస్తోంది. నిత్యం ఉదయం నుండి రాత్రి వరకు పాలు, కూరగాయలు, కిరాణా సామాగ్రి మొదలుకొని చికెన్, మటన్ వ్యాపారాల వరకు ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ కవర్లలోనే చేతులు మారుతున్నాయి. వ్యాపారులు, వినియోగదారులు కూడా ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపకుండా ఈ అత్యంత ప్రమాదకరమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను విరివిగా వాడుతున్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ డ్రైనేజీల్లో, ఖాళీ స్థలాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి మురుగునీరు నిలిచిపోయేలా చేస్తున్నాయి. కాగితపు సంచులను ఉపయోగించడం అటుంచితే, కనీసం గుడ్డ సంచులు లేదా పర్యావరణానికి హాని చేయని బయో-డిగ్రేడబుల్ బ్యాగులపై దృష్టి సారించకపోవడం ఇక్కడ ఒక పెద్ద సమస్యగా మారింది.
అధికారులు ప్రతి నెలా నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని, జరిమానాలు విధిస్తున్నామని పైపై ప్రకటనలు గుప్పిస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్ నివారణకు ఎలాంటి మార్పు రాకపోవడం అధికారుల పర్యవేక్షణా లోపానికి అద్దం పడుతోంది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికే కాకుండా మూగజీవాలకు సైతం తీరని అన్యాయం జరుగుతోంది. పట్టణంలోని రోడ్లపై, డస్ట్బిన్ల దగ్గర పారేస్తున్న ఆహార వ్యర్థాలను ఆయా ప్లాస్టిక్ కవర్లతో సహా పశువులు, వీధి కుక్కలు తింటున్నాయి. ప్లాస్టిక్ కవర్లు జీర్ణం కాక కడుపులోనే ఉండిపోయి, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో రోడ్లపైన వందలాది మూగజీవాలు ప్రాణాలు విడుస్తున్న దయనీయ స్థితులు నిత్యం కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్ సంచులను యథేచ్ఛగా వీధుల్లోకి వదిలేయడం వల్ల భూగర్భజలాలు కలుషితం అవ్వడమే కాకుండా, భూమి పొరల్లోకి నీరు ఇంకకుండా పోతోంది.
పర్యావరణ హితమైన కాగితపు సంచులు లేదా జ్యూట్ బ్యాగుల తయారీని ప్రోత్సహించడంలో స్థానిక సంస్థలు పూర్తిగా విఫలమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం చట్టాలు చేయడం, జరిమానాల బోర్డులు పెట్టడం వల్ల కాకుండా, కాలుష్య కారక ప్లాస్టిక్ ఉత్పత్తి కేంద్రాలపైనే శాశ్వత నిషేధం విధించినప్పుడే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుంది. చివరిగా చెప్పాలంటే, పేవర్ బ్యాగ్ డే లాంటి ప్రత్యేక రోజులు కేవలం క్యాలెండర్ లో పేజీలు తిప్పడానికో లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికో పరిమితం కాకూడదు. క్షేత్రస్థాయి వాస్తవాలను విశ్లేషిస్తే, నిర్మల్ జిల్లా ప్లాస్టిక్ రహితంగా మారాలంటే కేవలం అధికారుల తనిఖీలే కాకుండా, ప్రజల్లోనూ, వ్యాపార వర్గాల్లోనూ అంతర్గత బాధ్యత పెరగాలి. ప్రతి సగటు మనిషి మార్కెట్‌కు వెళ్లేటప్పుడు స్వచ్ఛందంగా గుడ్డ సంచి లేదా కాగితపు సంచిని తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే పర్యావరణానికి, మూగజీవాలకు రక్షణ లభిస్తుంది.











