జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బి. రాజశ్రీ శుక్రవారం పట్టణంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ఉద్యోగుల సమయపాలనపై కఠినంగా వ్యవహరిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
చంద్రశేఖర్ నగర్ కాలనీలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగుల హాజరు, ఓపి రిజిస్టర్లు, మందుల స్టాక్, ఇతర రికార్డులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. సమయానికి విధులకు హాజరుకాని వారిపై శాఖాపరమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ల నిల్వకు ఉపయోగించే ఐఎల్ఆర్ లో ఉష్ణోగ్రతలను క్రమం తప్పకుండా నమోదు చేయాలని, ప్రతి గర్భిణీ స్త్రీని 12 వారాల లోపు రిజిస్టర్ చేయాలని సూచించారు. ప్రమాదకర లక్షణాలున్న గర్భిణీలను గుర్తించి, ప్రత్యేక ప్రసవ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
ఉపకేంద్రాల పరిధిలో కేటాయించిన లక్ష్యాలను 100% పూర్తి చేయాలని వైద్య సిబ్బందికి సూచనలు జారీ చేశారు. అసంపూర్తిగా ఉన్న రికార్డులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని, ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రతను పాటించాలని ఆమె ఆదేశించారు.
ఈ తనిఖీలో డాక్టర్ కీర్తి, నర్సింగ్ ఆఫీసర్లు నేహా, అర్చన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న కొన్ని లోపాలను కూడా ఆమె గుర్తించినట్లు సమాచారం.










