నిజామాబాద్, 15 July
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'PM RAHAT' మరియు 'PM RAH-VEER' పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. ఈ పథకాలు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించడంతో పాటు, సహాయం చేసేవారిని ప్రోత్సహిస్తాయి.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడం, వారి ప్రాణాలను కాపాడటంతో పాటు, ప్రమాద బాధితులకు సహాయం చేసే పౌరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు కీలక పథకాలను అమలు చేస్తోంది. రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఆధ్వర్యంలో 'PM RAHAT' మరియు 'PM RAH-VEER' పథకాలు ఈ లక్ష్యంతో పనిచేస్తున్నాయి.
గోల్డెన్ అవర్‌లో రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించి ప్రాణాలను రక్షించడం, ప్రజల్లో మానవత్వాన్ని, బాధ్యతాయుతమైన స్పందనను పెంపొందించడం ఈ రెండు పథకాల ప్రధాన ఉద్దేశ్యాలు.
ఈ పథకం కింద, రోడ్డు ప్రమాదంలో గాయపడిన అర్హులైన బాధితులకు ప్రమాదం జరిగిన తేదీ నుండి గరిష్టంగా 7 రోజుల వరకు ₹1.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్ వైద్యం లేదా ఉచిత చికిత్స అందించబడుతుంది. ప్రభుత్వం గుర్తించిన ఎంపానెల్డ్ ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటులో ఉంటుంది.
ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో మనోరమ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ ఈ పథకం కింద పైలట్ ఆసుపత్రులుగా ఉన్నాయి.
రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలు (Grievous Injury) పొందిన బాధితులకు గోల్డెన్ అవర్‌లో సహాయం చేసి, సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేసిన వ్యక్తిని 'రాహ్-వీర్'గా గుర్తించి, కేంద్ర ప్రభుత్వం ₹25,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తుంది.
రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను eDAR (Electronic Detailed Accident Report) ద్వారా నమోదు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పోలీస్ శాఖ, రవాణా శాఖ, ఆరోగ్య శాఖ, ఆసుపత్రులు, బీమా సంస్థలు మరియు ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో అవసరమైన చర్యలను వేగవంతంగా చేపడతాయి.
రోడ్డు ప్రమాద బాధితుడిని చూసిన వెంటనే భయపడకుండా సహాయం చేయాలని, సమయానికి అందించిన సహాయం ఒక ప్రాణాన్ని కాపాడగలదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 'గోల్డెన్ అవర్‌లో అందించే సహాయం ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. రోడ్డు ప్రమాద బాధితుడికి వెంటనే సహాయం చేయండి. 112/100/108కు సమాచారం అందించండి. మీరు కూడా ఒక 'రాహ్-వీర్' అవ్వండి' అని నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. తెలిపారు.










