నిరుపేద కుటుంబాలకు సొంత ఇళ్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సయ్యద్ అవేజ్ డిమాండ్ చేశారు. ఊరికి 10 ఇళ్లు నిర్మిస్తామని, రూపాయికే వైద్యం అందిస్తామని ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
కొంతమంది నిరుపేదలకే సంక్షేమ పథకాలు అందించి, మిగతా అర్హులైన పేద కుటుంబాలను విస్మరించడం సరికాదని సయ్యద్ అవేజ్ అన్నారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎప్పుడు కేటాయిస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన కోరారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం కాకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడమే నిజమైన పాలన అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అడిగేది భిక్ష కాదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలేనని ఆయన స్పష్టం చేశారు. పేదలకు సొంత ఇళ్లు కల్పించడం, వైద్య భరోసా అందించడం ప్రభుత్వ బాధ్యతని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సయ్యద్ అవేజ్ డిమాండ్ చేశారు.












