రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, విద్యార్థులు, యువత అనేక సమస్యలతో సతమతమవుతున్నా, అసెంబ్లీ సమావేశాల్లో వాటిపై సమగ్రంగా చర్చించకుండా పాలక, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు, విమర్శలతో కాలక్షేపం చేశాయని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే అసెంబ్లీలో తిట్ల దండకానికి తెరతీశారని ఆయన ఆరోపించారు.
ఐదు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారు. మండలం గడ్కోల్ గ్రామంలో శుక్రవారం సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నిజామాబాద్కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా బహిరంగ సభ నిర్వహించారు. జిల్లా నాయకులు ఆర్. రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో పోటు రంగారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో రైతాంగం, కార్మిక వర్గం, విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో స్పందించాల్సిన అవసరం ఉందని పోటు రంగారావు అన్నారు. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదని, యాప్‌లకు సంబంధించిన సమస్యలతో ఎరువులు అందని పరిస్థితులు ఉన్నాయని అన్నారు.
రైతు బీమా వంటి పథకాలు అర్హులైన రైతులందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసే నాథుడు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. బోనస్‌ను కేవలం సన్నధాన్యానికే పరిమితం చేయకుండా, రైతులకు ఇచ్చిన హామీ మేరకు అమలు చేయాలని అన్నారు.
వ్యవసాయ కూలీలు, బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
వ్యవసాయ కూలీలకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని పోటు రంగారావు డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు ఇస్తామని ప్రకటించిన చేయూత పెన్షన్‌ను ఇప్పటికీ అందించకపోవడం సరికాదన్నారు. కార్మికులు, కూలీలు, పేదల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు ప్రభుత్వాలను ప్రశ్నించాలని, తమ హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలకు సిద్ధం కావాలని పోటు రంగారావు పిలుపునిచ్చారు.
పోడు భూముల సమస్యకు తక్షణ పరిష్కారం
రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న పోడు భూముల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పోటు రంగారావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో పోడు రైతుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం అటవీశాఖ అధికారుల ద్వారా పోడు రైతుల సమస్యను అణచివేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా అనుసరించకుండా, పోడు రైతులకు న్యాయం చేయాలని కోరారు. పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే, పోడు వ్యవసాయదారులు తమ హక్కుల కోసం ప్రతిఘటనకు దిగుతారని పోటు రంగారావు హెచ్చరించారు.










