నిజామాబాద్ జిల్లాలోని మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విద్యుత్ సరఫరా లోపం, ఎల్ నినో ప్రభావంతో బోరుబావులు ఎండిపోయి వరి పంటలు దెబ్బతిన్నాయని, అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
మండలం నిజామాబాద్ జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడ వంద శాతం వరి పంటనే సాగు చేస్తారని నర్సయ్య తెలిపారు. కనీసం కరువు మండలంగా ప్రకటిస్తారని రైతులు ఎదురుచూస్తున్నా, ఇప్పటివరకు ప్రకటించిన మండలాల్లో పేరు లేకపోవడం విచారకరమని అన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, వేముగంటి ప్రాజెక్టు లిఫ్టు, కాలేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని లిఫ్టులను, పెద్దవాగు, కప్పల వాగులను నింపి, మండలాన్ని సస్యశ్యామలం చేసి రైతులను ఆదుకున్నారని, ఆ సంగతి ప్రజలందరికీ తెలుసని, కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రావడం లేదని విమర్శించారు. ఈ ప్రాంతం నుండే పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లుగా ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డి వంటి బడా నాయకులు ఉన్నప్పటికీ, మండల పరిస్థితులు వారికి కనిపించడం లేదని అన్నారు. మండలాన్ని కరువు మండలంగా ఎందుకు ప్రకటించడం లేదని, వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని, కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న సునీల్ రెడ్డి ఈ మండలానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మండలంలో తనకు ఓట్లు ఎక్కువ రాలేదనే కారణంతో, కాంగ్రెస్ నాయకులు ఈ మండలాన్ని చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత కఠినతరం కానున్నాయని, ఎందుకంటే రైస్ మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేసి బ్లాక్ చేస్తున్నారని, ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకొని అదుపు చేయాలని కోరారు.
రానున్నది వేసవికాలం కాగా, గతంలోనే తెలంగాణ రాష్ట్రం 46 డిగ్రీల వేసవి ఎండ తీవ్రతను చవిచూసిందని, ఎల్ నినో వల్ల మరో రెండు మూడు డిగ్రీలు పెరిగితే ప్రజలు తట్టుకోవడం కష్టమని, కాంగ్రెస్ పాలకులు కచ్చితంగా సాగునీటి, తాగునీటి శాశ్వత ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయ రంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకుందని, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, కాలేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల పాటు ఉచిత నాణ్యమైన విద్యుత్తు, సకాలంలో రైతుబంధు, రైతు బీమా, పెట్టుబడి సాయం అందించడంతో కరోనా విపత్తు సమయంలోనూ కొత్త రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మండలాన్ని వెంటనే కరువు మండలం గా ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, లేదంటే, ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్, మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, సునీల్ రెడ్డిలు రాజీనామా చేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి, మండలాన్ని కరువు మండలంగా ప్రకటించేలా చూడాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజునాయక్, ఇక్రమ్, సిద్ధపల్లి రాములు, జీసన్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.












