నిజామాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణం, నిధుల విడుదల అంశంపై రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి తీవ్రంగా స్పందించారు. ఆర్ఓబీ నిర్మాణానికి కేంద్రం అడ్డుపడుతోందని నిరూపిస్తే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రెస్క్లబ్లోనా, రైల్వే బ్రిడ్జి వద్దనా చర్చకు సిద్ధమని ప్రకటించారు.
బుధవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దినేశ్ పటేల్ మాట్లాడుతూ, ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై భూపతిరెడ్డి నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఆర్ఓబీ నిర్మాణానికి సంబంధించి పెండింగ్ నిధుల విడుదల కోసం ఎంపీ అర్వింద్ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారని తెలిపారు. రూ.9 కోట్ల నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్ పంపించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతోనే ఎంపీ భిక్షాటనకు దిగారని ఆరోపించారు.
ఆర్ఓబీ పనుల్లో జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహనతో మాట్లాడాలని ఎమ్మెల్యేకు సూచించారు. అర్సపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర నిధులు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం భూమిని అప్పగిస్తే పనులు ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.
పసుపు బోర్డు, ఇతర అంశాలపై డిమాండ్
పసుపు బోర్డు విషయంలో విమర్శలు చేయడం కంటే, బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన భూమిని ఇప్పించేందుకు ఎమ్మెల్యే కృషి చేయాలని దినేశ్ పటేల్ అన్నారు. జక్రాన్‌పల్లి విమానాశ్రయం, సాగునీటి సదుపాయాల కల్పన వంటి అంశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
భూపతిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని, ఇటుక బట్టీలు, మొరం, ఇసుక క్వారీల వద్ద వసూళ్లు జరుగుతున్నాయని దినేశ్ పటేల్ ఆరోపించారు. ఈ అంశాలపై కూడా బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఆర్ఓబీ విషయంలో తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తే ఆధారాలతో చర్చకు రావాలని, లేనిపక్షంలో తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో దంపల్లి జ్యోతి, ఎర్రం సుదీర్, పద్మారెడ్డి, బొబ్బిలి వేణు, అమంద్ విజయ్ కృష్ణ, ఇప్పాకాయల కిషోర్, చింతకాయల రాజేందర్, బద్దం కిషన్, మల్లేష్ యాదవ్, పురుషోత్తం, జగదీష్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.

