నిజామాబాద్, 5 November
కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్ విద్యార్థులను వేధించిన ఆరోపణలపై 14 మంది సీనియర్ విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. వీరిలో నలుగురికి ఆరు నెలలు, పది మందికి నాలుగు నెలల పాటు సస్పెన్షన్ విధించారు.
కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను వేధించినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన కళాశాల అధికారులు 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. వారిలో నలుగురికి ఆరు నెలలు, మరో పది మందికి నాలుగు నెలల పాటు సస్పెన్షన్ విధించారు. కళాశాలలో సీనియర్లు తమను ర్యాగింగ్ చేస్తున్నారంటూ బాధిత జూనియర్ విద్యార్థులు వారం రోజుల క్రితం ఢిల్లీలోని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) యాంటీ ర్యాగింగ్ సెల్‌కు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్ఎంసీ అధికారులు స్థానిక పోలీసులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. దీంతో కళాశాల యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టింది. విచారణలో 14 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలను కూడా అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నలుగురు విద్యార్థులకు ఆరు నెలలు, మరో పది మందికి నాలుగు నెలల పాటు సస్పెన్షన్ విధించారు. మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్, ఉన్నతాధికారులు, హెచ్ఓడీలు ప్రత్యేకంగా సమావేశమై ఈ వ్యవహారంపై చర్చించారు. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారమే చర్యలు తీసుకున్నామని, ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని కళాశాల ప్రిన్సిపాల్ వెల్లడించారు.


