నిజామాబాద్ జిల్లాలో రాత్రి వేళల్లో ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మూడో టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.
పోలీసుల వివరాల ప్రకారం, హార్వెస్టర్ యంత్రాల పనుల నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చిన నిందితులు, రాత్రి సమయంలో ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, పలు చోరీ కేసుల్లో వారి ప్రమేయం వెలుగులోకి వచ్చింది.
నిందితులపై నిజామాబాద్ మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, అలాగే ఆర్మూర్ ప్రాంతంలో రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులను ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మూడో టౌన్ ఎస్ఐ హరిబాబుతో పాటు పోలీసు సిబ్బందిని టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ అభినందించారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.











