నందిపేట మండల కేంద్రంలో పూజా పూలను చెరువులో నిమజ్జనం చేయడానికి వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన విషాదకర సంఘటన బుధవారం చోటు చేసుకుంది.
రాంనగర్‌కు చెందిన పీ. సుజాత (50) బుధవారం ఉదయం ఇంటి వద్ద పూజ అనంతరం, పూలను రఘునాథ చెరువులో నిమజ్జనం చేసేందుకు వెళ్లారు. ఆమె భర్త గంగాధర్ బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన గంగాధర్, భార్య కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. స్థానికుల ద్వారా చెరువులో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో, అక్కడికి వెళ్లి చూడగా అది తన భార్య సుజాతదేనని నిర్ధారించుకున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన గంగాధర్, సుజాతకు బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు ఉండేవని, పూల నిమజ్జనం చేస్తుండగా కాలు జారి చెరువులో పడి మృతి చెంది ఉండవచ్చని తెలిపారు. ఈ మృతిపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని ఆయన పేర్కొన్నారు.
నందిపేట ఎస్సై వినయ్ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.






